అంబేద్కర్.. పుట్టకుండా వుండి వుంటే.. ఈ మాట వూహించడానికే కష్టం. జాతి యావత్తూ తీవ్రంగా నష్టపోయి వుండేది. అసమానతలు ఇంకా రాజ్యమేలేవి. బానిసత్వం కన్నా నీచమైన సంస్కృతులెన్నో బడుగు బలహీన వర్గాల పాలిట శాపాలుగా మారివుండేవి. ఆ ఒక్కడూ పుట్టక పోయి వుండి వుంటే.. మనుషులు మనుషులుగా బతికే అవకాశమే లేక పోయి వుండేది. ‘అంటరానితనం తప్పు’ అని ఎలుగెత్తి చాటిన తొలి సాహసి. రాజ్యాంగరచనకు నాయకత్వం వహించిన గొప్ప మేధావి. కులమతవర్గవైషమ్యాలు లేని జాతి కోసం అహర్నిశలూ కలలుగన్న స్వాప్నికుడు.
సమాజంలో ఎటు చూసినా అసమానతలు. బతుకు పోరాటంలో ఎదుర్కొవాల్సిన అవమానాలు. మేమూ మీబోటి వాళ్లమే అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు. అసలు మానవత్వం అన్న మాట మరిచిపోయి ప్రవర్తించే వారే అధికం. ఈ భూమ్మీద ఎందుకు పుట్టామని బాధ పడే వారి కష్టాలు తీర్చడానికి ఒక్కడంటే ఒక్కడూ లేని సమయం. ఒక జ్యోతి వెలిగింది. ఒక ఆశాకిరణం ఉదయించింది. చీకట్లను చీల్చుకుని ఒక వెలుగురేక విచ్చుకుంది. అతడే అంబేద్కర్.. భీంరావ్ రాంజీ అంబేద్కర్.. అందరూ ‘బాబాసాహెబ్’ అని ప్రేమగా పిలుచుకునే అంబేద్కర్. ఆ మహనీయుడి జీవిత చరిత్రలోకి ఒక పయనం..
ఒక్కసారి అంటరానివారిగా పుడితే.. జీవించి వున్నంత వరకూ ఆ బాధ భరిస్తూనే వుండాలి.తమ నడతనే కాదు, నడకను కూడా తప్పు పట్టేవారా రోజుల్లో. తమ అడుగులను తామే ఊడ్చుకుంటూ వెళ్లాల్సిన స్థితి. రోమన్ సామ్రాజ్యపు కట్టుబానిసత్వం కన్నా దారుణమైన బతుకు. ఎంతకాలం.. ఇంకెంతకాలం..? ఈ చీకట్లను పారదోలడానికి ఏ సూర్యుడు ఉదయిస్తాడు? బతికుండగానే అనుభవించే నరకంలోంచి తప్పించే తపస్వి ఎవడు? తెలిసి చేసిన తప్పుకు శిక్షైతే పరవాలేదు. తెలియక పుట్టినందుకు ఇంతగా అనుభవించాలా? ఏమిటిది? ఎదురు ప్రశ్నించే వారే లేరా? అని సామాన్యులు.. అట్టడుగు వర్గాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ.. రోధిస్తున్న సమయం. ఆ ఉషోదయం వస్తూ వస్తూ అంబేద్కరనే భాస్కరుడిని వెంట తెచ్చింది. ఆ ఒక్క ఉదయానికి వేల వేల దండాలు. ఆ ఒక్క అరుణోదయానికి కోటానుకోట్ల నమస్కారాలని చెప్పుకున్నారు ఆ తరువాతి రోజుల్లో జనం.
అది మధ్య ప్రదేశ్ లోని మహోం అనే గ్రామం. రాంజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు.. 1891, ఏప్రిల్ 14న ఒక బాలుడు జన్మించాడు. అతడా దంపతులకు పుట్టిన పదనాల్గవ సంతానం. ధర్మశాస్త్ర పండితుడు, భారతప్రధాన రాజ్యాంగ నిర్మాత, రాజకీయనాయకుడు, స్వాతంత్రోద్యమ దళిత నాయకుడు,న్యాయవాది, బౌద్ధుడు, తత్త్వశాస్త్రవేత్త, ఆన్త్రోపాలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగీకుడు, రచయిత, అర్ధశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధధర్మ పునరుద్ధరణకర్త. ఇదీ అంబేద్కర్ అనే అతడి గురించి చరిత్ర చెప్పినవివరం. ఇంతటి మేధావి.. పుట్టింది నిమ్నజాతిలో. అడుగడుగునా అవమానాలు ఎదురవుతుంటే.. ఆ చిన్ని మనసు ప్రతిక్షణం షాకు మీద షాకులకు గురువుతుంటే.. ‘‘జన్మ జన్మకూ, జాతి జాతికీ మధ్య తరతమబేధాలున్నాయిరా బాలుడా!’’అని న్యాయం వెక్కిరిస్తుండగా అతడి బాల్యం గడిచింది. అందుకే కావచ్చు, తరువాతి కాలంలో.. స్వతంత్ర భారత తొలిన్యాయశాఖా మంత్రి అయ్యేంతగా కృషి చేశాడు.
కూర్చుంటే తప్పు. నిలుచుంటే తప్పు. మాట్లాడితే తప్పు. చదివితే తప్పు. అందునా వేదం చదివితే, నాలిక తెగ్గోసేంత పెద్ద తప్పు. అలాగని చదవకుండా వుండి వుంటే.. ముఖ్యంగా ఆ బుడతడు పుస్తకం పట్టకుండా వుండి వుంటే.. ఈ అడ్డుగోడలను కూల్చేదెవరు? తన వారికి దారి చూపేదెవరు?? ఈ ‘అసభ్య’ సమాజానికి సభ్యత నేర్పేదెవరు???
ఈ సంఘర్షణల్లోంచి పుట్టుకొచ్చిన జాతిరత్నం అంబేద్కర్. మట్టిలోంచి వెలుగుచూసిన మాణిక్యం అంబేద్కర్. కష్టనష్టాలకోర్చి.. తనకెదురైన ప్రతి ప్రశ్నకూ సమాధానం వెతికిన మేలిమి ముత్యమతడు. బానిస సంకెళ్లను తెంచడంలో కృషి చేసిన కార్యధీక్షాపరుడు. కులం ఎంతటి ‘కార్చిచ్చో’ గుర్తెరిగిన మహనీయుడు. మనుషులుగా పుట్టి, జంతువులకన్నా హీనంగా బతికే బతుకుల్లోంచి విముక్తి కోసం పరితపించిన వాడు అంబేద్కర్. కట్టుబాట్లను ఎదురించి సాటి మనుషులను బంధ విముక్తులను చేసిన వాడు అంబేద్కర్.
1913వ సంవత్సరం.. అంబేద్కర్ కొలంబియా యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్లాడు. బరోడా స్టేట్ వారు నెలకు పదకొండున్నర పౌండ్ల చొప్పున మూడేళ్లపాటు ఇచ్చే స్కాలర్ షిప్పుతో తను విదేశాల్లో విద్యనభ్యసించాలి. మూడేళ్ల కాలంలోఒకటికి రెండు పీజీలు, పీ. హెచ్. డీ చేశాడు. అందులో భాగంగా ‘కాస్ట్స్ ఇన్ ఇండియా’ అనే థీసెస్ సమర్పించాడు.
‘‘భారతదేశంలో టచబుల్స్, అన్ టచబుల్స్ అనే రెండు జాతులుంటాయి. ఒకరు పరిపాలను అత్యంత దగ్గరగా ఉంటే, మరొకరు చాకిరీ చేయడానికి మాత్రమే పరిమితమౌతూ బతుకునీడ్చాల్సి వుంటుంది. ముఖ్యంగా అంటరాని వారిగా పుట్టినట్టైతే ఆ బతుకు నుంచి చచ్చే వరకూ విముక్తి లభించదు. ఇదీ నా ఇండియా..’’ అంటూ ఆయన ఆవేదన నిండిన స్వరంతో చెబుతుంటే అక్కడి వారి గుండె కరిగిపోయింది. లండన్ వెళ్లబోయే ముందు చర్చిలో ఈ సమస్య గురించి ఫాదర్ ప్రస్తావించి, అంబేద్కర్ ప్రయాణం చక్కగా సాగాలని ప్రార్ధిస్తాడు.
అంబేద్కర్ లండన్ లో చదవడానికి వచ్చినప్పుడు.. తన గురించి వివరాలు చెబుతున్నప్పుడు.. తను ఇండియన్ ఎకానమీ మీద చేసిన థీసెస్ వివరాలను అధికారులు చదువుతున్నప్పుడు.. తన లగేజీని తనిఖీ చేస్తున్నప్పుడు.. అంబేద్కర్ ఆలోచనలు ఒక్కసారిగా ఇండియాకు వెళ్లిపోయేవి. తాము కేవలం ఎడ్ల బండి ఎక్కడానికి లేదు. కేవలం అంటరాని వాళ్లమన్న మిషతో నిర్ధాక్షణ్యంగా బండి నుంచి తోసేసే వాళ్లు. దిమ్మ తిరిగి పోయే అనుభవాలు ఒక్కొక్కటీ వెంటాడి వేధించేవి. తనలో కసిని రగిల్చి లక్ష్యాన్ని తెలియచెప్పేవి.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరిన కొన్నాళ్లకే బరోడా స్టేట్ వారి స్కాలర్షిప్ కాలపరిమితి పూర్తయింది. లండన్ నుంచి తిరిగి రమ్మంటూ ఉత్తరం వచ్చింది. అంబేద్కర్ ఈ మూడేళ్ల మధ్యకాలంలో సంపాదించిన ఆస్తి.. పుస్తకాలే. దురదృష్టవశాత్తూ ఆ పుస్తకాలు సముద్ర ప్రమాదానికి గురయ్యాయి. అప్పుడు అంబేద్కర్ పడ్డ బాధ వర్ణనాతీతం.
ఇండియా వచ్చినా కూడా చదువు.. చదువు.. చదువు.. ఇదీ అతడి అంతరంగం. అంబేద్కర్ కు చిన్ననాడే రమాభాయితో వివాహమైంది. తను అర్ధాంతరంగా చదువు ముగించి ఇండియా వచ్చేశాడు. తిరిగి లండన్ వెళ్లగలనా అన్న ఆలోచనల్లో ఉన్నప్పుడు భార్య ‘‘అంత నాలెడ్జ్ ని ఏం చేసుకుంటావు?’’ ఇక్కడే వుండిపో అంటుంది. అంబేద్కర్ కు చదువు కొనసాగించాలని వుంది. కానీ, అంతకన్నా ముందు.. బరోడా ఎస్టేట్ లో ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా వుంది.
ఎక్కడో విదేశాల్లో అయితే పర్లేదు. తన దేశం.. తన పురిటిగడ్డ మీద.. తనను కన్నబిడ్డలా అక్కున చేర్చుకోవాల్సిన ప్రజల మధ్యన.. అంబేద్కర్.. మహర్ కులస్తుడవటం వల్ల.. అది కూడా అంటరాని వాడవటం వల్ల.. ఒక వారం పాటైనా, ఆ బరోడా నగరంలో నివసించడానికి అంత చోటు దొరికింది కాదు. స్వదేశంలో.. ఒక స్వదేశీయుడికి.. అందునా ఆ కాలంలో.. తన జాతి మొత్తంలోకి విదేశాలకు వెళ్లి, అంత పెద్ద చదువులు చదువుకొచ్చిన అతడికి.. నిలవడానికి అంత నీడ దొరకింది కాదు. ఏం బతుకిది? ఎంత దారుణమైన పరిస్థితి? ఎట్టకేలకు ఒక పార్శీ సత్రంలో బస దొరుకుతుందతనికి.
ఆఫీసులో కూడా ఇదే తీరు. అవడానికి పై అధికారి. కానీ, ఆ స్థాయిలో గౌరవం కాదు కదా.. కనీస మర్యాద కూడా దక్కక పోయేది. ఫైళ్లివ్వమంటే విసిరేసే వాళ్లు తోటి ఉద్యోగస్తులు. తాము తాగే కుండలోంచి నీళ్లు తాకడానికి వీల్లేదంటూ మొండికేసేవాళ్లు. అటెండరు దృష్టిలో కూడా అంబేద్కర్ ఒక ఆఫీసరుగా పరిగణించక పోయేవాడు.
ఆఫీసర్స్ క్లబ్ లో కూడా అదే వివక్ష. ‘డాక్టర్ అంబేద్కర్’ అని పిలుస్తూనే క్లబ్ సెక్రటరీ, ‘‘మీరు సపరేటు వస్తువులను వాడాలి. అందరూ వాడే ఏ వస్తువు కూడా వాడరాదు..’’ అంటూ మెత్తగానే గట్టి ఆదేశాలు జారీ చేస్తాడు. తనలాంటి వారి జీవితంలో ప్రతి సంఘటన సాంఘీకంగా కించపరుస్తూనే వుంటుందా? ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువ చేస్తూనే ఉంటుందా? స్వాతంత్రోద్యమం కన్నా ముందు చేయాల్సిన ఉద్యమం ఒకటుంది. అదే ‘‘సాంఘీకోద్యమం’’ స్వతంత్రం కావాలనుకునే వారికి మొదట తాము కొన్ని అవలక్షణాలనుంచి స్వతంత్రులవ్వాలి. తరువాతగానీ నిజమైన స్వాతంత్రం సిద్ధించదనుకున్నాడు అంబేద్కర్.
బరోడా రాజుకు చెప్పినా ప్రయోజనం శూన్యం. తరువాత అంబేద్కర్ బొంబాయిలోని ‘సిడెన్హమ్ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్’ లో ప్రొఫెసర్ గా చేరాడు. అక్కడా ఇదే తీరు. అంటరానితనం వెంటాడుతూనే వుంది. ఈ జబ్బును వదలగొట్టడానికి ఏదైనా చేయాలి. తరువాతి రోజుల్లో ఆ మౌననాయకుడు ‘మూక్ నాయక్’ అనే పత్రిక తీసుకువచ్చాడు.అంబేద్కర్ రచనలు కోలాపూర్ సంస్థాన్ సాహూ మహరాజ్ కు నచ్చాయి. ఆయన అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడవుతాడని గుర్తించాడు. అర్ధాంతరంగా ఆగిన అంబేద్కర్ చదువు తిరిగి కొనసాగేందుకు తన సహాయం అందిస్తాడు. మళ్లీ అంబేద్కర్ లండన్ పయనమవుతాడు.
గాంధీజీ రగిల్చిన స్వాతంత్రోద్యమం ఉధృతంగా వుందని.. లండన్ లో వుండగా తెలుస్తుంది అంబేద్కర్ కు. ‘‘గాంధీజీ కర్తవ్యం అక్కడితో పూర్తి కాలేదు. సుమారు కోటిన్నరపైగా ప్రజలు అంటరానితనమనే మహమ్మారి బారిన పడి కుమిలిపోతున్నారు. కుంగిక్రుసించిపోతున్నారు. కోలుకోలేని విధంగా గాయపడి విలవిలలాడుతున్నారు. వారి సమస్యలు తీర్చడానికి కూడా ఆయన ముందుకు రావాలని’’ ఆవేశంతో అంటాడు అంబేద్కర్.
లండన్ లో వుండగానే సాహూ మహరాజ్ మరణవార్త అందుతుంది అంబేద్కర్ కు. లండన్ వెళ్లిన లక్ష్యం పూర్తయింది. అంబేద్కర్ చేతికి లా డిగ్రీ అందుతుంది. తిరిగి ఇండియా వస్తాడు. అంబేద్కర్ పునరాగమనానికి కుటుంబసభ్యులు సంతోషిస్తారు. అన్నిటికన్నా మించి తాను చేయాల్సినది మరొకటుంది. తనవారి జీవితాలను సంస్కరించడం. వారిలో మార్పు తీసుకురావడం. వారిని ఉన్నత శిఖరాల వైపుగా మళ్లించడం. అందుకు సభలు నిర్వహించి మాటలనే మంత్రాలుగా చేసుకుని వారికి వినిపిస్తాడు భీంరావ్ రాంజీ అంబేద్కర్. అందులో భాగంగా హితకారిణీ సభను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటిస్తాడు.
అంబేద్కర్ సాంఘీకోద్యంలో ఉండగానే రాజరత్న అనే ఒక బిడ్డ పుట్టి చనిపోతుంది. తరువాత అంబేద్కర్ బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయ్యాడు. అక్కడ కూడా అదే సంఘర్షణ. అంటరానితనాన్ని రూపుమాపడమే ధ్యేయంగా ఆయన ఉద్యమం సాగుతుంది. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అనే నినాదంతో అంబేద్కర్ ఇచ్చిన పిలుపు అందుకుని వేలాదిగా ప్రజలు కదలివచ్చారు. సభ తీర్మానం అనుసరించి అందరూ చెరువుకు వెళ్లి మూకుమ్మడిగా నీళ్లు తాగుతారు. అది గ్రామస్తుల్లో తీవ్ర అలజడి చెలరేగడానికి కారణం అవుతుంది.
అంబేద్కర్ మాములు తేనె తుట్టె కదపలేదు. అంటరానితనమనే జగడాలమారి తేనెతుట్టెను కదిపాడు. ఆయన ప్రసంగాలు విని పులకించిన జనం.. చెరువు నీళ్ళు తాగిన వైనం.. తరువాత అగ్రవర్ణాల చేత తీవ్ర అవమానం ఎదుర్కొనేలా చేసింది. ఏకకాలంలో రెండు దాష్టీకాలు. బ్రిటీషర్లు పెట్టే టార్చర్లనైనా ఓపిగ్గా భరించొచ్చేమోగానీ స్వదేశీయులు.. అందునా తమ సేవలందుకుని ఆనందం అనుభవించే ప్రజలు.. పెట్టే బాధలను ఏ భగవంతుడికి చెప్పుకున్నా తీరేవి కాదు. వారికి అంబేద్కరనే మహానుభావుడు తప్ప మరొకరు చెప్పుకునేందుకు దొరకలేదు. ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి.. ‘‘డాక్టర్ సాహెబ్ మమ్మల్ని కాపాడండి. మా మీద జరుగుతున్న దాడుల నుంచి రక్షించండని’’ మొరపెట్టుకున్నారు.
అంబేద్కర్ చెరువు ఘటన.. ఆయన కుటుంబజీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. మహర్లు తాగెళ్లిన నీళ్ల చెరువులో ప్రాయశ్చితం నిర్వహించారు గ్రామస్తులు. అంబేద్కర్ ఒక సభలో.. ఈ విధానంలో ప్రత్యేకించి బ్రాహ్మణులను తాను విబేధించడంలేదనీ.. బ్రాహ్మణిజంలో వున్న లోపాలనే విమర్శిస్తున్నానని స్పష్టం చేసాడు. ఇంగ్లీష్ కలెక్టర్ అంబేద్కర్ను పిలిచి పరిస్థితి అర్ధం చేసుకోవలసిందిగా అభ్యర్ధించాడు.
ఎన్ని మబ్బులడ్డు వచ్చినా.. ఉదయించిన సూర్యుడు పైపైకి ఎగబాకక మానడు. ప్రచండుడై వెలుగొందక మానడు. భారతదేశాన్ని పునర్ నిర్మించాలి. ‘‘కాస్ట్ లెస్, క్లాస్ లెస్’’ సొసైటీకై మనం ఉద్యమించక తప్పదంటూ అంబేద్కర్ సభ నిర్వహించాడు. తరువాత పూనాలో సైమన్ కమీషన్ ఎదుట హాజరై తన అభిమతం చాటాడు. గాంధీ నాయకత్వం ‘సైమన్ గో బ్యాక్’ నినాదం బయట వినబడుతోంది. అదే సమయంలోఅంటరానితనం రూపుమాపే దిశగా అంబేద్కర్ తన అభిప్రాయాలను స్పష్టం చేశాడు.
దేవుడు మా సొత్తు. దేవాలయాలు మా తాతల ఆస్తి. అందులో అస్పృశ్యులకు గడ్డిపరకంత వాటా కూడా లేదు. వారి ప్రవేశానికి అనుమతులిచ్చేది లేదు. దేవుడ్ని కూడ నిమ్నకుల వ్యతిరేకిగా చిత్రించారు. దీన్ని వ్యతిరేకించాలి. దేవుడనే భావమే తరతమబేధాలను రూపుమాపేందుకు. ఈ మాటే మరచిపోయారు. ‘మనుషులంతా ఒక్కటే’ అన్న స్ఫూర్తి నుంచి ఎప్పుడో నిష్క్రమించారు. తమ పుర్రెకేది తోస్తే అంత దారుణానికి ఒడిగట్టారు. వీళ్లకెవరు బుద్ధి చెబుతారు?‘ప్రారంభం అన్నది ఒకటి జరక్కుంటే ప్రారబ్ధం మారదు’ అందుకు అంబేద్కర్ తొలి అడుగు వేశాడు. నాసిక్ దేవాలయంలోకి ప్రవేశించడానికి తన వారిని కదిలించాడు.
హక్కుల కోసం ఆరాటం. దేవుడ్ని, మతాన్ని, మనుస్మృతినీ, వేదాలనూ అడ్డుగా చూపుతూ సాగే అరాచకాలు అంతం కావాలన్న పోరాటం. అంబేద్కరనే ఊతకర్ర సాయంతో బడుగు బలహీన దళిత జనులు తమ సంక్షేం, సమానత్వాలకోసం సాగించిన సమరం. అందులో భాగంగా మళ్లీ గాయపడ్డారు బహుజనులు. బ్రాహ్మణులు దేవుడ్ని గుడి నుంచి బయటకు తరలించారు. దాంతో, అలజడి చెలరేగింది.
అంబేద్కర్ ఎక్కడైనా సరే ఒక్కటే వినిపించడానికి ప్రయత్నించేవాడు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన అతడు.. బహుజనవాణి వినిపించాడు. ప్రపంచానికి ఇక్కడి ప్రజల బాధేంటో తెలియాలి. ఫలితం కోసం ఆశించకుండా ప్రయత్నించమని ఏ గీతాభోద విన్నాడో కానీ నిరంతరం అదే పని. అంటరానితనం నిర్మూలనే ధ్యేయంగా అతడి ప్రసంగాలు కొనసాగేవి.
నిజాలెంత నిప్పులాంటివో ఆయన మాటలు వింటే తెలిసేవి. బాధితులు అధికారానికి దగ్గరైతే తప్ప వారి బాధలు తీరవని చెప్పేవాడు. నిజమైన ప్రజాస్వామ్యం వస్తే కానీ బడుగుల వెతలు కనుమరుగు కావనేవాడు. కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన అంబేద్కర్ గాంధీని కలిశాడు. తన మీద, కాంగ్రెస్ మీద అంబేద్కర్ కున్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నాడు గాంధీ. నిప్పులు చెరిగాడు అంబేద్కర్. ఇది తమ ‘హోంలాండ్’ కాదని ఆవేదన చెందాడు. మాకంటూ ఒక ‘పొలిటికల్ సేఫ్ గార్డ్’ కావల్సిందేనని పట్టుబట్టాడు.
స్వతంత్రం కోసం గాంధీ బ్రిటీషర్లతో పోరాడుతుంటే, అంటరానితనం అమానుషమని.. నేరమనీ.. నిరసిస్తూ అంబేద్కర్ గాంధీతో పోరాడే వాడు. పొరాటంలో సమాంతర పోరాటమా అన్నట్టు సాగేదాయన సాంఘీకోద్యమం. అధికారం కొద్దిమంది చేతిలో వుండటం అన్నమాట మరిచిపోవాలి. అధికారం అందరి చేతుల్లోకి రావాలి. అప్పుడే అంటరానితనం రూపుమాపగలం. పొలిటికల్ సపరేట్ ఎలక్టొరేట్స్ అన్నది కావల్సిందే. ఇదీ 1932లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ వినిపించిన వాణి. గాంధీ అలా వద్దంటాడు.
అది 1932వ సంవత్సరం. పూనా జైలు. గాంధీ ఉపవాస ధీక్ష చేస్తున్నాడు. అంబేద్కర్ సపరేట్ ఎలక్టొరేట్స్ కావాలని పట్టు పట్టాడు. గాంధీ ఆరోగ్యం నానాటికీ బలహీన పడుతుంటే అంబేద్కర్ అంతకన్నా ఎక్కువ పట్టుదలతో వున్నాడు. కొన్ని సీట్లను రిజర్వేషన్ ప్రాతిపథికన డిప్రెస్ క్లాసులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సంఖ్యలో తేడాలొస్తున్నాయి. అంబేదక్కర్ పట్టు వదలడం లేదు. బాపూజీ ఆరోగ్యం పూర్తిగా సన్నగిల్లింది. అంబేద్కర్ సీట్ల సర్ధుబాటు విషయంలో ఒక నిర్ణయానికి రావలసి వచ్చింది. అప్పుడుగానీ గాంధీ తన ధీక్ష విరమణ చేయలేదు.
ఆ సమయానికి స్వాతంత్రోద్యమ సమరంలోపాల్గొని ప్రతి ఒక్కరూ హీరోలుగా చెలామణీ అయిపోతున్నారు. ఒక్క అంబేద్కర్ మాత్రమే విలన్. హిందువుల పాలిట ప్రతినాయకుడిగా మారాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం దృష్ట్యా అతడు ఎందరికో గిట్టని వాడయ్యాడు. ఎవరికోసం తాను పాటుపడ్డాడో వారికి తానేమవుతాడో లేదో తెలియదుగానీ ఎంతోమందికి తానో బద్ధశత్రువుగా మారాడు. వీళ్లకిప్పుడు తెలియదు. వచ్చేరోజుల్లో నా విలువేమిటో అప్పుడు తెలుస్తుందనుకున్నాడు అంబేద్కర్.
అంబేద్కర్ అన్న ఆ ఒక్కడు జన్మించక పోయి వుంటే.. ఒక జాతి మొత్తం అపనిందలపాలై వుండేది. ప్రపంచం ముందు నగుబాటుకు గురై వుండేది. అంటరానితనం అనే అగాధంలోంచి ప్రజలు బయట పడకపోయి వుండేవారు. మానవత్వం అన్న మాట సిగ్గుతో నిలువునా చచ్చి వుండేది. అంటరానితనం కోసం పోరాడ్డంలో భాగంగా ఆయన తన భార్య ఆకరు కోరిక కూడా తీర్చలేకపోయాడు. పండరిపురం దర్శించాలనుకున్న ఆమె కోరికను ఒప్పుకోలేదాయన. మన పండరిపురాలను మనమే సృష్టించుకునే సమయం వస్తుంది. అందుకోసం మనం ఉద్యమించాల్సి వుందని ఆమెను వారించాడు. అవి ఆమె చివరిక్షణాలు..
భార్య రమాబాయి మరణానంతరం అంబేద్కర్ జీవితం అనేక మలుపులు తీసుకుంది. నాలుగొందల మంది గ్రామస్తులు ముస్లిములుగా కన్వర్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అందుకు విరుగుడుగా‘ఎవ్లా కాన్ఫరెన్స్ ’లో అంబేద్కర్ ముఖ్య ప్రకటన చేశాడు. సాంఘీకచెరసాల నుంచి విముక్తులు కండి. ఎక్కడ మనకు సమానత్వమనే ఫలాలు లభిస్తాయో అక్కడకు వెళ్దాం పదండి‘‘ అంటూ నినదించాడు. మొత్తంగా అంబేద్కర్ అంటరానితనానికి పరిష్కారంగా హిందూమతానికి వ్యతిరేకంగా పేల్చిన బాంబు భారీగా మోగింది. గాంధీ చలించిపోయాడు.
విచిత్రమేంటంటే బాబాసాహెబ్ ప్రకటనకు క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులను ఆకర్షించాయి. మా ప్రార్ధనాలయాలకు రావలసిందిగా ఆహ్వానించారు. ఈ సంఘర్షణల్లో వుండగానే, బ్రిటన్ జర్మనీ మీద యుద్ధనగారా మోగించింది. అంబేద్కర్ నాయకత్వంలోని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బ్రిటన్ కు పూర్తి సపోర్టు ప్రకటించింది. అలాగే ముస్లిములు ఆశిస్తే పాకిస్తాన్ ఇవ్వవలసిందేనని తెలిపాడు. అంబేద్కర్ కృషి వల్ల అంటరానితనం నేరమన్న ప్రకటన కూడా వెలువడింది.
స్వతంత్రభారత తొలి న్యాయ శాఖామంత్రిగా అంబేద్కర్ పేరు పరిశీలనకు వచ్చింద. ది ఫస్ట్ లా మినిష్టర్ ఆఫ్ ది నేషన్ గా అంబేద్కర్ సరిగ్గా ఉంటాడని నేహ్రూతో, గాంధీజీ అన్నాడు. నెహ్రూ కూడా అందుకు ఒప్పుకున్నాడు. రాజ్యాంగరచన చేయవలసిందిగా నెహ్రూ అంబేద్కర్ను కోరాడు. అంబేద్కర్ దశ తిరిగిందని పత్రికలు రాసాయి. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది.
అంబేద్కర్ బీపీ లెవల్స్ పెరుగుతున్నాయి. వైద్యులు ఎంత సూచించినా ఆయన ఆరోగ్యం విషయంలో శద్ధ తీసుకోవడం లేదు. ఏం చెయ్యడం.. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ ఛైర్మన్. కావలసినంత పని ఒత్తిడి. అదే సమయంలో ఆ యువ వైద్యురాలు సవిత అంబేద్కర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. రాజ్యాంగరచనలో ఉండగానే గాంధీజీ మరణించాడన్న వార్త విని అంబేద్కర్ షాకయ్యాడు. 1948 సంవత్సరంలో సవితతో అంబేద్కర్ వివాహం జరిగింది. తదనంతర కాలంలో ఆయన కాన్సటెంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాడు.
అంబేద్కర సూచించిన హిందూ కోడ్ బిల్ మీద నిరనలు వెల్లువెత్తాయి. హిందూధర్మమంటే ఆయనకేం తెలుసునని హిందూమత పెద్దలు ప్రశ్నించారు. ఒక్క చట్టంతో హైందవాన్ని నాశనం చేయడానికతనికెన్నిగుండెలు? వంటి మాటలు హోరుమన్నాయి. ఆ సంఘర్షణ కాలంలో అంబేద్కర్ కేబినేట్ నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆ తరువాతి కాలంలో అంబేద్కర్ బౌద్ధధర్మం వైపు ఆకర్షితుడయ్యాడు. చిన్ననాడు తనకు బుద్ధుడి పుస్తకం బహుమతిగా వచ్చింది. ఈ హిందూధర్మవ్యతిరేక పరిస్థుల్లో బౌద్ధిజం వైపుకు వెళ్లేందుకు ఇష్టపడ్డాడు అంబేద్కర్.
1956, డిసెంబర్ 6న అంబేద్కర్ తుదిశ్వాస విడిచాడు. మనుషుల్లో అసమానతలుండ కూడదని అంబేద్కర్ అంత ధైర్యంగా చాటకుండా వుండి వుంటే.. ఈ సమాజం ఏమయ్యి వుండేది? మానవత్వానికి నిలువ నీడ లేకాండా పోయి వుండేది. అంటరానితనం అంటువ్యాధిలా ప్రబలి దేశం సర్వనాశనం అయివుండేది. ఆయన మన మధ్య వెలసిన మరో బుద్ధుడు. ఆయన హిందువుల్లో పుట్టిన మరో బుద్ధుడు. ‘‘ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్’’ అని నినదించిన ఆ మహనీయుడు జాతి గర్వించదగిన హీరో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి