26, మే 2015, మంగళవారం

దళితులు కోసం పనిచేస్తున్న సంఘాల కార్యకలాపాలను పరిశీలిస్తే..................

దళితులు కోసం పనిచేస్తున్న సంఘాల కార్యకలాపాలను పరిశీలిస్తే, అనుభవాలు స్పష్టం గా చెబుతున్నాయి - వారి కార్యాచరణలో వున్న బలహీనతలు సానుకూల ఫలితాలు రాకుండా అడ్డు పడుతున్నాయని. 
ఈ సందర్భంగా ప్రధానమైన బలహీన తలు ఆరింటిని గుర్తించాము.
1. దళిత, ప్రజా సమూహాలను వారి హక్కుల సాధనకై సమీకరించడంలో వైఫల్యం:
అనేక సంఘాలు, సంస్థలు, వ్యక్తులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగానూ, దళితులు ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసమూ పని చేస్తున్న మాట నిజమే కాని వారు చాలా వరకు ప్రత్యేక సంఘటనల పట్ల ప్రతి స్పందించడానికే పరిమితమై పోయారు. దళితులు తమ హక్కుల కోసం నిలబడేలా నిత్యం తామెదుర్కొంటున్న వివక్షపై తిరగబడేలా చేయడానికి అవసరమైన నిరంతర ప్రచార ఉద్యమం ఈ సంఘాలు, నాయకులు చేపట్టడం లేదు.
2. ఆచరణ కొంచెం, ఆర్భాటం హెచ్చు:
కుల సమస్య గురించి అంతులేని చర్చలు, వాదనలు సాగుతూ ఉన్నాయి. హిందూ మతాన్ని తిరస్కరించకుండా కుల వ్యవస్థనెలా అంతమొందిస్తాం అనేదొక ప్రశ్న. వర్గాలు పోకుండా కులాలు పోతాయా అన్నది మరో ప్రశ్న. అసలు కుల వ్యవస్థను మూలాల్తో పెకలిం చకుండా కుల వివక్షను, అస్పృశ్యతను తొలగించ గలమా? ఇది ఇంకో ప్రశ్న. ఈ విధంగా చర్చలు మొదలవడం, పరస్పర దూషణలకూ, నిందారోపణలకూ దిగడం పరిపాటి అయింది. సమస్యలను అర్థం చేసుకోవడానికి సిద్ధాంత పరమైన చర్చలు, వాదనలూ అవసరమే. అయితే వాదోపవాదాలకే పరిమితమై పోతే సరిపో తుందా? వాదాల ద్వారా పరిష్కారం కాని సమస్యలను ఆచరణ ద్వారా పరిష్కరించుకొనే అవకాశం ఉంది. చెప్పేదేమిటి, చేసేదేమిటి అనేదాన్ని బట్టి ఏ సంఘం విలువ ఎంతో తెలుసుకోవచ్చు.
3. అంటరానితనాన్ని తొలగించే విషయంలో విశ్వాసం లేకపోవటం:
కొందరు వ్యక్తులు అసలు కులమనేది పోతేగాని అస్పృశ్యత, కుల వివక్ష పోదని నిరాశ వ్యక్తం చేస్తుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. నిరంతరమైన, సంయుక్త పోరాటం ద్వారా అస్పృశ్యతను, కుల వివక్షను అంతమొందించడం సాధ్యమే.
4. అనైక్యత:
వివిధ కుల సంఘాల, ఆస్థిత్వ సంఘాల ధోరణి ఐక్యత వైపు కాకుండా చీలికలు, పేలికలు చేసే పద్ధతిలో ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంది పరిస్థితి. సామాజిక న్యాయం సాధించే కర్తవ్యానికి ఈ పరిస్థితి పెద్ద అవరో ధంగా ఉన్నది. కారంచేడు, చుండూరు వంటి దుర్ఘటనల సందర్భాలలో ఒక మాదిరి ఐక్యత కనిపించినా అది వెంటనే మాయమైపోతున్నది. అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యను మరచి అంతర్గత విభేదాలను ముందుకు తెస్తున్నారు. విశాల ఐక్యత కోసం ప్రయత్నించడమే లేదు. ఐక్యత సాధించడానికి ఉత్ప్రేరకాలుగా పని చేసే సంఘాల ఆవశ్యకత నేడు ఎంతగానో ఉంది.
5. వేలాడుతున్న ఒంటెత్తు ధోరణులు:
దళితులు కాని వారికి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని వాదించే ఒంటెత్తు దోరణి ప్రబలంగా ఉంది. దళితుల గురించి దళితులు మాత్రమే అర్ధం చేసుకోగలరనీ, దళితుల కోసం దళితులు మాత్రమే పోరాడగలరనీ వాదిస్తారు. ఈ ధోరణి ఇటీవలి కాలంలో కొంత తగ్గినప్పటికీ ఇంకా గణనీయంగానే ఉంది. ఈ ధోరణిని అధిగమించకుండా ఒంటరిపోరాటం విజయం సాధించదు. దళితుల ఆత్మగౌరవం కోసం సాగే పోరా టంలో దళితులది కీలకమైన స్థానం. అందులో అనుమానానికి తావు లేదు. అయితే మద్దతుగా ప్రజాస్వామ్య శక్తులనూ, దళితేతర తరగతులనూ కూడగట్టుకునే విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
6. శ్రామికవర్గ ఉద్యమాలు ఈ సమస్యపై అవసరమైనంత శ్రద్ధ చూపక పోవడం:
దోపిడీ లేని సమాజం కోసం పని చేసే శక్తులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు ప్రజల్ని అనేక సంఘాలలో కూడగట్టి ఉద్యమ బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక సంఘాలు, విధ్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు- ఇంకా ఎన్నో సంఘాలు పని చేస్తు న్నాయి. తమ రోజువారీ కార్య క్రమాలకు తోడుగా దళితుల సమస్యలపై కృషికూడా అవసరమని ఈ సంఘాలు గుర్తించాయి. అయితే ఈ ప్రత్యేక అంశంపై నిరంతరం పని చేయడంలో విఫల మవుతున్నాయి. వారు తమ రంగాలలో చేపట్టే సమస్యల తీవ్రత, పని వత్తిడి దీనికి కారణం.
అస్పృశ్యత, కుల వివక్ష అంతం కావాలని కోరుకునే సంఘాలు, వ్యక్తులు ఈ బలహీనతలను అధిగమించడానికి శ్రమించాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి