నా పాటల్లోఅంబేద్కర్‌ను ఆవిష్కరించా -
ప్రజావాగ్గేయకారుడు జయరాజ్.
ఆయన నేపథ్యం విప్లవం. సామాజిక రుగ్మతలను స్పృశించిన ఆయన పాటసాగు వేనోళ్ల బాగు బాగు అనిపించుకుంది. అడవిలో అన్నల చుట్టూ తిరిగిన ఆయన పాటలు తర్వాతి కాలంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కీర్తించాయి. అంబేద్కర్ జీవితాన్ని ఔపోసన పట్టిన ప్రజావాగ్గేయకారుడు జయరాజ్. బాబాసాహెబ్ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను, భావాలను ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు.
అడవిలో మొదలైన మీ పాట అంబేద్కర్‌ను ఎలా చేరింది..?
నేను నక్సలైట్ల జీవితాన్ని అన్ని కోణాల్లో స్పృశిస్తూ కొన్నేళ్లు పాటలు రాశాను. ప్రకృతిని, వాళ్లను పోలుస్తూ కీర్తించాను, వాళ్లలో చీలికలు వచ్చినపుడు నా కలంతో దెప్పిపొడిచాను. వస్తువ్యామోహంపై నిలదీశాను. వాళ్లలో సంఘర్షణాత్మక ధోరణిని, అడవితల్లితో ఆత్మీయంగా ఆడుకున్న దృశ్యాల్ని, ఆదర్శ వివాహాలను.. ఇలా ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో పాటలు రాశాను. నా జీవితమంతా అడవికే అంకితం అనుకున్నా. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించలేదు. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. షుగర్, బీపీ, కామెర్లు చివరకు క్యాన్సర్ కూడా వచ్చింది. రెండు నెలల కంటే ఎక్కువ బతకనన్నారు నిమ్స్ డాక్టర్లు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎండ్లూరి చెన్నయ్యగారు రాసిన అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఒకాయన నాకిచ్చారు. అది చదివాక అంబేద్కర్ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది.
మీకు అంబేద్కర్ ఎలా అర్థమయ్యారు?
సోషలిస్ట్ భావాలున్న మహనీయుడిగా అంబేద్కర్ నాకు కనిపించారు. మార్క్స్ ఎక్కడో పుట్టలేదు ఇక్కడే పుట్టాడనిపించింది. కమ్యూనిస్టులు భూములు పంచాలన్నారు. అంబేద్కర్ భూములు జాతీయం చేయాలన్నారు. పరిశ్రమల్లో కార్మికులకు వాటా కావాలన్నారు. సామాజిక సమానత్వం రావాలంటే ఇవి జరగాలన్నారు అంబేద్కర్. ఆయన గురించి చదువుతుంటే నాకు ఏదో తెలియని అనుభూతి. అప్పటికే నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆ సమయంలో నాకు తెలిసిన అంబేద్కర్‌ను నా పాటల్లో ఆవిష్కరించాలని అనుకున్నా. ఆయన చరిత్రను పాటల రూపంలో రాశాను.
మీ పాటల్లో అంబేద్కర్ ఎలా ఉంటాడు?
స్వేచ్ఛకు అత్యున్నతమైన రూపంగా, ప్రజాస్వామ్యానికి ప్రతిబింబంగా ఉంటాడు. కులవర్గ సమాజాన్ని నిర్మూలించాలని కలలుగన్న అంబేద్కర్‌గా నేను కీర్తించాను.
ఆ పాటలకు ప్రతిస్పందన ఎలా వచ్చింది..?
మార్క్స్‌కు, అంబేద్కర్‌కు ఎక్కడా తేడాలేదంటూ ‘జాగోరే జాగో అంబేద్కర్’ పాటల్లో వినిపించాను. ఇద్దరూ పేదల కోసం పరితపించిన వారే. మార్క్స్ కూతురు చనిపోయినపుడు శవపేటికకు డబ్బులు లేక మూడు రోజులు ఆ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. అంబేద్కర్ కొడుకు పోయినపుడు ఆ మృతదేహంపై కప్పడానికి కనీసం వస్త్రం లేకపోతే, తన భార్య చీరను చించి కొడుకు మృతదేహంపై కప్పి సాగనంపాడు. ఇద్దరి జీవితాలు అంత దగ్గరగా ఉన్నాయి. ఇలాంటివి పోలుస్తూ పాటలు రాశాను. అయితే అంబేద్కర్‌ను మార్క్స్‌తో పోలుస్తావా అంటూ అంబేద్కరిస్టులు వ్యతిరేకించారు. బూర్జువా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ను మార్క్స్‌తో పోలుస్తావా అంటూ మార్కిస్టులూ మండిపడ్డారు. రాళ్ల దాడి చేయలేదంతే. ఈ రెండు వర్గాలను ఐక్యం చేయాలని భావించాను. ఆ దిశగా నా గొంతుక వినిపించాను. తొలుత విమర్శించిన వారే తర్వాత నా వాదనను ఒప్పుకున్నారు.
అంబేద్కర్ ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారు..?
అంబేద్కర్ జీవితంలో అడుగడుగునా వివక్ష ఎదురైంది. ఆయన బొంబాయిలో న్యాయవాదిగా ఉన్నప్పుడు సొంతంగా సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నా ఓర్వలేకపోయారు. నీకు ఇల్లు ఎవరిచ్చారని ఆయనపై దాడి చేసి చేయి విరగ్గొట్టారు. కట్టుబట్టలతో ఆయన ఊరు దాటి వెళ్లారు. విదేశాల్లో గొప్ప చదువులు చదివిన తనకు ఇలాంటి మర్యాద ఇచ్చారని ఆయనెంతో ఆవేదన చెందారు. ఇలాంటి సంఘటనలు జీవితంలో ఎన్నో.
నేటి సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా..?
ఏం మారలేదు. టెక్నాలజీ వచ్చిందంతే. వ్యత్యాసాల్లో చిన్నపాటి మార్పు వచ్చిందేమో కానీ వ్యవస్థలో లేదు. తినే ఆహారం విషయంలో ఆంక్షలు, గుళ్లోకి ప్రవేశంపై కట్టుబాట్లు, ఫోన్‌లో అంబేద్కర్ రింగ్‌టోన్ పెట్టుకుంటే ఓ పిల్లాడ్ని చంపేశారు.. దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ రోజుల్లోనూ వివక్ష ఎదుర్కొంటున్నారు, అసలు సమస్య ఎక్కడుంది?
అనేక రకాల వ్యవస్థలు, ధోరణులను క్రోడీకరించి చక్కని రాజ్యాంగాన్ని రాశారు అంబేద్కర్. అసలు రాజ్యంగబద్ధంగా మన పాలకులు పరిపాలిస్తే అందరి జీవితాలు మారేవి. ఈ సమస్యలే ఉండేవి కావు. భూముల్ని ఇవ్వాలి అన్నారు, కులాన్ని నిషేధించాలి, పరిశ్రమల్లో భాగం కావాలి అన్నారు. ఇవేం పాలకులకు పట్టవు. ఓటు హక్కు ద్వారా చట్టాలు మార్చుకొని, సమాజాన్ని మార్చుకోవచ్చని చెప్పారు. ఎక్కడ మార్చారు? సంపన్న వర్గాలకు అనుకూలంగా చట్టాలు మార్చుకుంటూ వచ్చారు. అందుకే ఇన్ని అసమానతలు.
ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ అసమానతలకు కారణమంటారా?
ఓటు విలువ నేటికీ ఎవరూ తెలుసుకోలేపోతున్నారు. ఎన్నికల్లో కరెన్సీ కట్టలు కుమ్మరిస్తున్నారు.
సారా ఏరులై పారుతోంది. అంతెందుకు అంబేద్కర్ గురించి ఎన్నో మాట్లాడుతుంటారు. కాని, ఎన్నికల వేళ.. అదే కులపోళ్ల ఓట్లు అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు.
ఒకరి హక్కుల మీద పోరాడితే మిగతావారు అంబేద్కర్‌ను సమస్యగా ఎందుకు భావిస్తున్నారు?
మహాత్మాగాంధీ కంటే ముందే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అన్నాడు. ఈ దేశానికి స్వాతంత్య్రం రావాలనుకున్నవాడు, రాజ్యాంగం ఇచ్చినవాడు, ముక్కలవుతున్న జాతుల్ని ఏకం చేశాడు. ఒక్కమాటలో అంబేద్కర్ ఈ దేశానికి ముఖచిత్రం లాంటివాడు. అగ్రవర్ణాల వారికి కూడా ఇది వర్తిసుంది.
భవిష్యత్తులో వచ్చే సామాజిక అసమానతలను అంబేద్కర్ ముందుగానే ఊహించారనుకోవచ్చా..?
ఈ దేశంలో అగ్రవర్ణాలు, పెట్టుబడిదారులు అంబేద్కర్‌ను కింది కులం వాడిగా చూస్తున్నారు. కాని, ఆయన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం లేదు. అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల ఆధారంగా చట్టసభలకు ఎన్నికైన వారు అక్కడికి వెళ్లాక ఆయా వర్గాల బాగు కోసం మాట్లాడటం లేదు. ఇలాంటి వారిని చూసి అంబేద్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ వ్యక్తిగత జీవితానికి ఇచ్చిన ప్రాధాన్యంలో కాస్తయినా సమాజానికి ఇవ్వాలని ఆ రోజుల్లోనే వాపోయారు.
ప్రస్తుతం మన సమాజంలో చిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవి దేశ ప్రతిష్టకు భంగం కలిగించేవన్న వాదన ఏ మేరకు నిజం?
అంబేద్కరిజం అనేది సలసల కాగుతున్న సలాడ్ లాంటిది. ఈ రాజ్యాంగం పట్టని చొక్కాలాంటిది అని అన్నారాయన. తన భావాలు ఇందులో పట్టడానికి అవకాశం లేదని కూడా వివరించారు. ఓసారి పార్లమెంట్‌లో.. ‘ఈ రాజ్యాంగం ప్రజలకు ఉపయోగపడనపుడు.. దీన్ని నేనే తగలబెడతాను’ అని అన్నారాయన. అంతకంటే రివల్యూషన్ ఎవరుంటారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ దేశం పవిత్రంగా ముందుకు పోతుంది. అమలు చేయకుంటే ఈ దేశంలో విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి అంబేద్కరిజమే పునాది.
మీరు ఏ రకమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు?
అభివృద్ధి అంటే ఎత్తయిన మేడలు.. అందమైన రోడ్లు కాదు. మానవ జీవితంలో నైతిక, సాంస్కృతిక అభివృద్ధే దేశానికి అత్యున్నతమైన రూపం అని ఆయన చెప్పారు. అంటే మనిషిని మనిషిగా చూడాలి. ప్రతి మనిషీ ఒక గౌతమబుద్ధుడు కావాలనే తాత్విక చింతన చెప్పారు. మద్యం సేవించకూడదు, సీ్త్రలను కించపరచొద్దు, శ్రమ దోపిడీ వద్దు, ఇతర జీవరాశులను ఇబ్బంది పెట్టకూడదు.. అంబేద్కర్ చెప్పినవి ఇవే.
ఆ ఆశయాలను అందుకోలేకపోవడానికి కారణం?
అంబేద్కర్ ఆశయాలను ప్రతివారు చెబుతున్నారు. కాని, తమ స్వార్థం కోసం చెబుతున్నారు. అంబేద్కర్ పేరు వాడుకోవడం ఓట్లు పొదడం, ఆర్థికంగా బలపడటం.. ప్రస్తుత ధోరణి ఇది. ఎల్లకాలం ఇలా జరగదు. ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మన దేశానికి వచ్చి వేల ఎకరాల్లో ఫ్యాక్టరీలు పెట్టి సంపదల్ని కొల్లగొడుతున్నారు. మన దేశంలోని సంపన్నవర్గాలు రాజ్యాంగాన్ని పాటించరు. అంబేద్కర్ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇది అంతిమంగా బానిసత్వంలోకి వెళ్లిపోతుంది.
దీనికి పరిష్కారం ఏమిటి?
ఈ పరిస్థితిని బ్యాలెట్‌తోనే ఎదుర్కోవాలి. లేదంటే బుల్లెట్ మార్గం. అలాంటి అవసరం ఇప్పుడు రాదనుకుంటా. ప్రస్తుతం కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. గూగుల్‌లో కొడితే చాలా సమాచారం వస్తోంది. విశాలమైన ప్రపంచంలో బతుకుతున్నాం. అందరూ కంఫర్ట్‌గా జీవించాలనే వాతావరణం పెరిగింది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంబేద్కర్ ఆశించిందీ ఇదే.
కార్మిక వ్యవస్థ పురోగతికి రాజ్యాంగ నిర్మాత భావజాలం ఎంత వరకు ఉపయోగపడుతుంది?
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లు ఊడ్చేవారంతా కిందివాళ్లే ఉంటారు. ఈ శ్రామికుల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు నాయకత్వం వహించే స్థితికి రావాలని కోరుకున్నారు అంబేద్కర్. అవమానాలకు గురవుతున్నవారు ముందువరుసలోకి వచ్చి నిలచి గెలవాలని ఆశించారు.
ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయంటారా..?
కిందివర్గాలలో చైతన్యం పెరిగింది. ఆత్మగౌరవం విషయంలో గొంతుక వినిపిస్తున్నారు. కానీ, ఈ మార్పును కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. అంబేద్కర్ పుణ్యానే ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయ్యాడని ప్రకటించిన మోదీ కూడా ఈ మార్పును తట్టుకోలేకపోతున్నారు. ఆయన కింది వర్గం నుంచి వచ్చిన వాడే అయినా.. విశాలమైన వేదికపై స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారు.
సాంస్కృతిక చైతన్యం విషయంలో అంబేద్కర్ ఆలోచనా విధానం ఏమిటి?
దేశాభివృద్ధిని అంచనా వేయాలంటే సంస్కృతే ప్రధానం అంటారు అంబేద్కర్. స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లలో దేశంలో సాంస్కృతిక విప్లవం రావాలని అంబేద్కర్ కలలు కన్నాడు. కానీ అది నేటికీ నెరవేరలేదు. ఆయన ఆశించిన మార్పు వచ్చినప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. ఈ సమానత్వం ఆశించే నేడు యూనివర్సిటీల్లో ఉద్యమాలు పురుడుపోసుకుంటున్నాయి. అలా వచ్చిన వాళ్లే రోహిత, కన్నయ్య.
- నవ్యడెస్క్
మానుకోట.. జయరాజ్ పాట
మానుకోటలో మానులకు తెలుసు జయరాజ్ పాట. తండ్రితో వలస వెళ్లిన నల్లగొండలో ప్రతి కొండకు తెలుసు ఆయన బాణీ. విప్లవం ఆయన సాహిత్యం.. ఆవేశం అతడి సంగీతం. తండ్రిలాగే దొరల గడిలో జీతగాడిగా మిగిలిపోవాల్సిన జయరాజ్.. అదే తండ్రి మాట మీద విప్లవ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నాడు. మానుకోటలో ఇంటర్ చదివాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే దొరతనంపై వ్యతిరేకంగా గళమెత్తాడు. ‘మిణుగురు మెరిసిన నేరమేనా తెలంగాణ పల్లెలో.. మీసం మొలిసిన నేరమేనా తెలంగాణ పల్లెలో..’ అంటూ నినదించాడు. పలుమార్లు అరెస్టయ్యాడు కూడా. కొత్తగూడెం సింగరేణిలో కార్మికుడిగా చేరాక జయరాజ్ పాటలు నిప్పుల కొలిమిలో మరింత రాటుదేలాయి. విప్లవ కార్మిక సంఘాల నాయకుడిగా ఎదిగేలా చేశాయి. ఈ క్రమంలో యాజమాన్యం నుంచి బెదిరింపులు, జీతంలో కోతలు, ఇంక్రిమెంట్ల విషయంలో తేడాలు.. ఇలా ఎన్ని జరిగినా జయరాజ్ సాహిత్యంలో పస తగ్గలేదు. ఆయన పోరాటంలో వెనుకడగు వేయలేదు. కార్మిక నాయకుడిగా పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. మరోవైపు దొరతనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నక్సలైట్లకు తనవంతుగా పాటల రూపంలో స్ఫూర్తి నింపాడు. ‘ఎవ్వరో ఈ బిడ్డలు.. నింగిలో నెలవంకలు.. ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు..’ అంటూ ఎర్రదండుకు వెన్నుదన్నుగా నిలిచాడు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు.
చూస్తూ ఊరుకోం
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముప్పయ్ ఏళ్లు ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ ఫొటోను పార్లమెంట్‌లోకి తీసురాలేకపోయింది. ఇపుడు మోడీ తనకు స్ఫూర్తి అంబేద్కర్ అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇపుడిప్పుడే అంబేద్కర్ అందరివాడు అవుతున్నాడు. కొందరు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్‌ను వారిలో కలిపేసుకుంటున్నారు.
మాలాంటి శక్తులున్నాయి. కవులు, కళాకారులున్నారు, తాత్వికులున్నారు. అంబేద్కర్‌ను మేం అంత తేలిగ్గా వదిలిపెట్టం. ఆయన్ని దేవుడిని చేస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు. ప్రజలను మభ్యపెట్టలేరు.
కులతత్వంతోనే కోల్పోయాం
రోహిత జీవితం ఆది నుంచీ సంఘర్షణాత్మకంగానే సాగింది. యూనివర్సిటీ స్థాయిలో కూడా అదే కులవివక్ష ఎదురవ్వడంతో తట్టుకోలేపోయాడు. కులతత్వంతో పోరాడలేక తనువుచాలించాడు. అంతకు ముందు నన్ను ఎన్నోసార్లు కలిశాడు. నా పాటలు వినేవాడు. చివరకు ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా నా పాటలే పాడుకున్నాడట. రోహిత మరణం నన్నెంతో కలచివేసింది. కులతత్వం వల్ల రోహితను కోల్పోయాం.